బై ఎలక్షన్స్ వస్తే మేం సిద్ధమే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : ఎంపీ రఘువీర్ రెడ్డి

బై ఎలక్షన్స్ వస్తే మేం సిద్ధమే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : ఎంపీ రఘువీర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తే తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నల్గొండ ఎంపీ రఘువీర్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఎన్నికలు అంటే భయపడబోమని స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మాది రాజకీయ పార్టీ.

ఎన్నికలు వస్తే పోటీ చేయాల్సిందే. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నికలు వస్తే భయపడం.. పోటీ చేస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు కేవలం నోటీసులే ఇచ్చింది. తుది తీర్పు రావాల్సి ఉన్నది. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ముందుకు వెళ్తాం. బై ఎలక్షన్లు వస్తే వెనక్కి పోయే ప్రసక్తే లేదు’’అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పార్టీ అభ్యున్నతి కోసం కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అందుకే వారి కష్టాన్ని అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, దాసోజు శ్రావణ్, నెల్లికంటి సత్యం నల్గొండ ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం జిల్లా అదృష్టమని తెలిపారు.